Advertisement
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే.. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఆ రోజు నుంచి కనిపించకుండా పోయారు. మధ్యలో టీఆర్ఎస్ సభలో ఓసారి, కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఓసారి కనిపించారు. అంతే.. ప్రగతి భవన్ లో ఉన్నారని, ఫాంహౌస్ కు తరలించారని అనేక వార్తలు వచ్చాయి. వారికి భద్రత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. అయితే.. రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు మరోసారి బయటకొచ్చారు.
Advertisement
తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. తమను ఎవరూ నిర్బంధించలేదన్నారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. చంపుతామంటూ వార్నింగ్ ఇస్తున్నారని.. రక్షణ కోసమే తమని కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండమన్నారని తెలిపారు.
Advertisement
ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారమే రక్షణలో ఉన్నామన్న బాలరాజు.. ప్రజాస్వామ్యాన్ని బతికించే వారధులుగా తాము ఉన్నట్లు చెప్పారు. సీఎంకు అందుబాటులో ఉండటానికే ప్రగతి భవన్ లో ఉన్నామని.. ప్రజలకు తాము ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నామని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టే ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. వారికి ఖచ్చితంగా బుద్ది చెబుతామన్నారు.
తమ మీద వాడుతున్న సంస్థలతోనే అంతం చేస్తామని.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్న బీజేపీని దోషిగా నిలబెడతామన్నారు గువ్వల. కేసీఆర్ వదిలిన బాణంగా పని చేస్తామని.. తమను బెదిరించే వారిపై ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. ఇక తన నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.100కోట్లు తీసుకుని ఎటో వెళ్లిపోయానని నియోజకవర్గంలో పోస్టర్లు వేసిన వ్యక్తుల రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశం వెనుకబడిపోతోందని విమర్శించారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరముందన్న ఆయన.. తమను బెదిరింపులకు గురిచేసిన వారికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామన్నారు.