Advertisement
టీఆర్ఎస్ శ్రేణులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ కు ఓకే చెప్పింది. టీఆర్ఎస్ పేరు మార్పుపై స్పందించింది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితిని ఆమోదిస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ పంపింది.
Advertisement
ఈ ఏడాది అక్టోబర్ 5 దసరా రోజున టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ వేదికగా ఈ ప్రకటన చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కేసీఆర్ తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈక్రమంలోనే పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ తీర్మానాన్ని పంపారు కేసీఆర్. దీనికి తాజాగా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో పార్టీ నాయకులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేసీఆర్ స్పీడ్ పెంచారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శుక్రవారం(09-12-2022) మధ్యాహ్నం 1:20 గంటలకు ఆయన అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేదిక నుంచి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు హాజరుకావాలని కేసీఆర్ కబురు పంపారు. వారితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ తెలంగాణ భవన్ కు రావాలని సూచించారు.