Advertisement
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీలన్నీ తలమునకలయ్యాయి. నువ్వానేనా అంటూ జనాలకు పోటీపడి మరి గాలం వేస్తున్నాయి. ఈక్రమంలోనే పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేశాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ ఫుల్ స్పీడ్ లో ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. ఎవరొస్తారో రండి.. ఎంత మంది వస్తారో రండి అంటూ తెలంగాణ భవన్ వెల్ కమ్ బోర్డు పెట్టేసింది. సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి కార్యాచరణను అమలు చేస్తున్నారు.
Advertisement
చేరికలపై దృష్టి సారించిన కేసీఆర్ ఎవరు వస్తానన్నా రమ్మని చెబుతున్నారు. అలా.. గతంలో బండబూతులు తిట్టి పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు కూడా తిరిగి కేసీఆరే దేవుడు అని తిరిగి వచ్చేస్తున్నారు. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ ఆకోవకే చెందుతారు. వీళ్ల బాటలోనే మరికొంతమంది నేతలు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ చేరికల స్పీడప్ వెనుక రెండు రకాల ప్రయోజనాలను వివరిస్తున్నారు రాజకీయ పండితులు.
Advertisement
మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న ఈ సమయంలో స్థానికంగా బలంగా ఉన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన నర్సయ్య కాషాయ కండువా కప్పుకున్నారు. ఇది కేసీఆర్ ను బాగా హర్ట్ చేసింది. ఈ చేరిక వల్ల పార్టీ నుంచి ఇంకొంతమంది వెళ్లిపోతారన్న భయం ఓవైపు.. మునుగోడులో ఓటమి తప్పదనే ఆందోళన ఇంకోవైపు. ఈ క్రమంలో కేసీఆర్ రంగంలోకి దిగి ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారని అంటున్నారు. దీనివల్ల ప్రస్తుతానికి తమ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని చెప్పే ఉద్దేశం అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక టీఆర్ఎస్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్ కోసం చేరికల కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ. టీఆర్ఎస్ లో మొదట్నుంచి పని చేసి.. అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఈటల రాజేందర్ ను కన్వీనర్ గా నియమించింది. ఆయన కూడా దూకుడుగానే వ్యవహరించి టీఆర్ఎస్, బీజేపీలోని కొందరు లీడర్లకు కాషాయ కండువా కప్పేశారు. దీంతో బీజేపీ బలోపేతం అవుతోందనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్ చేయడం బీజేపీకి చెక్ పెట్టే ప్రయత్నమేనని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ కు దీటుగా బీజేపీ కూడా వ్యూహరచనలో ఉందని చెబుతున్నారు.