Advertisement
వెండితెరపై ఓ వెలుగు వెలిగారు నటి విజయశాంతి. ఆ తర్వాత 1998లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009లో ఆ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. అదే ఏడాది ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే.. 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి.. అదే ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. 2020 డిసెంబర్ 7న తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరారు.
Advertisement
విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా మన రాములమ్మ రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు.
Advertisement
కేసీఆర్ కు అభద్రతాభావం ఎక్కువైందని విజయశాంతి అన్నారు. తాను కనబడొద్దని అనుకున్నారని.. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రోజే తనను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో తనను ఓడగొట్టేందుకు కూడా ప్రయత్నించారన్నారు. ఎన్ని బాధలు పడ్డా మనుసులోనే దాచుకున్నానని.. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కు మరోసారి అధికారమిస్తే రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితులు వస్తాయన్నారు విజయశాంతి.
పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడింది విజయశాంతి మాత్రమేనని అన్నారు బండి సంజయ్. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉందని.. కుటుంబ పార్టీలో ఉండదని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబపాలన అంతం కోసం విజయశాంతి పోరాడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో వాటిని సాధించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలు కూడా విజయశాంతి రాజకీయ ప్రస్థానంపై మాట్లాడారు.