Advertisement
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక నివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నిక నవంబర్ మూడో తేదీన జరగనుండగా ఆరో తేదీన కౌంటింగ్ ఉండనుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి తెరపడింది. ఈ తరుణంలో ఇవాళ మునుగోడు రణరంగంగా మారింది. టిఆర్ఎస్ మరియు బిజెపి కార్యకర్తల మధ్య పెద్ద రచ్చే జరిగింది. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఈటల కారు ధ్వంసం అయింది.
Advertisement
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో టిఆర్ఎస్ నేతలు కూడా గాయపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ సహా పలువురు టీఆర్ఎస్ నేతలు గాయపడ్డారు. పలివేల బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్తగారి ఊరు. ప్రచారం చివరి రోజు కావడంతో ఈటల ర్యాలీ తీస్తున్నారు. మునుగోడులో జరగనున్న మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శనగా వెళుతున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు ఎదురుపడటంతో గొడవ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ సందర్భంగానే కొందరు ఎమ్మెల్యే రాజేందర్ కాన్వాయ్ పై దాడికి దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. దాదాపు అరగంట పాటు ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పలివేల రణరంగం అయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలివెలలో ప్రస్తుతం పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.
Advertisement
పలివెల ఘర్షణ పై టీఆర్ఎస్, బిజెపి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. బిజెపి ట్రాప్ లో పడొద్దని, టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. గొడవలు సృష్టించి అలజడి రేపేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని చెప్పారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకుని హంగామా చేస్తారని హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు కమలనాధులు మాత్రం అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పలివేలలో ఈటల సభ జరగకుండా చూడాలనే దాడికి పాల్పడ్డారని మాజీమంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి మరి దాడి చేయించారని అన్నారు. ఓటమి భయంతోనే టిఆర్ఎస్ గుండాయిజం చేస్తుందని ధ్వజమెత్తారు.
read also : చంద్రబాబుకు..జనసేన సైనికులు బానిసలే ?