Advertisement
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. మొత్తం 135 రోజులపాటు 75 జిల్లాల్లో 3,570 కిలోమీటర్ల మేర నడిచారు రాహుల్. షెడ్యూల్ ప్రకారం యాత్ర సోమవారం ముగియాల్సి ఉంది. అయితే.. ఒకరోజు ముందే ముగించాల్సి వచ్చింది.
Advertisement
శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సమయంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. ఆ ప్రాంతమంతా బారికేడ్లతో మూసేశారు. భారీ సెక్యూరిటీ మధ్య రాహుల్, ప్రియాంక లాల్ చౌక్ లో పర్యటించారు. వీరి వెంట జైరాం రమేష్, ఇతర నేతలు ఉన్నారు. 75 ఏళ్ళ క్రితం 1948లో భారత తొలి ప్రధాని నెహ్రూ లాల్ చౌక్ లో మొదటిసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Advertisement
సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీనగర్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇక మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. జోడో యాత్ర విజయవంతంగా ముగిసిందని చెప్పారు. విశేష స్పందన వచ్చిందన్నారు. ఈ యాత్రతో రైతులు, నిరుద్యోగ యువత సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. ద్వేషానికిక తావు లేదని.. ఈ దేశంలో సదా ప్రేమే జయిస్తుందని తెలిపారు. ఇండియాలో సరికొత్త ఆశాకిరణాలు ఉదయిస్తాయని తెలిపారు.
కశ్మీర్ లో పరిస్థితులు సాధారణంగా ఉంటే బీజేపీ నేతలు జమ్ము నుంచి లాల్ చౌక్ కు ఎందుకు నడిచి రాలేరు అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఇక్కడి పరిస్థితులు ప్రశాంతంగా వుంటే అమిత్ షా ఎందుకు పర్యటించరని అడిగారు. జోడోయాత్ర ముగియడంతో ఇకపై రాహుల్ ఏం చేయబోతున్నారనే దానిపై చర్చ మొదలైంది.