Advertisement
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. ఏం మాట్లాడినా ఏదో ఒక వివాదం రేగుతోంది. మొన్న ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చివరకు మహిళా కమిషన్ ఎదుట హాజరై.. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, మరోసారి రిపీట్ చేయొద్దంటూ కమిషన్ సీరియస్ వార్నింగే ఇచ్చింది.
Advertisement
లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి కొద్దిరోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేశారు బండి. తప్పు చేస్తే అరెస్ట్ చేయకుండా ముద్దుపెట్టుకుంటారా? అని వ్యాఖ్యానించారు. కవితను ఈడీ విచారించే సమయంలో ఈ ఇష్యూ చుట్టూ రచ్చ నడిచింది. బీఆర్ఎస్ వర్గాలు బండిని టార్గెట్ చేసి ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు చేశాయి. దీంతో సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది. ముందు ఓ డేట్ చెప్పి రావాలని ఆదేశించగా.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 18న వస్తానని సమాధానం ఇచ్చారు సంజయ్.
Advertisement
ఈ క్రమంలోనే 18న కమిషన్ ముందుకు బండి హాజరవ్వగా చివాట్లు పెట్టినట్టు సమాచారం. కమిషన్ దగ్గరకు తన న్యాయవాదితో కలిసి వెళ్లారు సంజయ్. అయితే.. లాయర్ ను లోపలికి అనుమతించకుండా.. బండిని మాత్రమే విచారణకు రమ్మని చెప్పింది కమిషన్. దాదాపు రెండున్నర గంటలపాటు విచారించింది. కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ కోరింది. గతంలో ఇలాగే మహిళలు, కవిత పట్ల మాట్లాడిన వీడియోలు ప్రదర్శించి మరీ బండికి క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరోమారు మహిళలను ఉద్దేశించి సామెతలను ప్రయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరి.. బండి ఇది ఫాలో అవుతారా? అంటే కష్టమనే అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలను టచ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు సంజయ్. ఇప్పటివరకు ఆయన ప్రసంగాలను గమనిస్తే ఇది స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు. అలాంటిది సంజయ్ లో మార్పు కష్టమనే అంచనా వేస్తున్నారు. ఫ్లోలో ఎక్కడో ఒకచోట తొందరపడి మాట్లాడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.