Advertisement
ఈమధ్య కాలంలో తెలంగాణ మంత్రులు, ఏపీ మంత్రులు మధ్య పెద్ద వారే నడిచింది. దానికి ఆద్యుడు మంత్రి హరీష్ రావు. ఏపీకి చెందిన కార్మికుల్ని తెలంగాణకు ఓటుహక్కు మార్చేసుకోవాలని చెబుతూ.. అక్కడి అభివృద్ధి గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నేతలకు చిర్రెత్తుకొచ్చింది. తీవ్ర విమర్శలు చేశారు. వాటికి బీఆర్ఎస్ నేతల నుంచి గట్టి కౌంటర్స్ పడ్డాయి. అయితే.. ఈ వివాదం తర్వాత చల్లబడినా.. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ ఎంట్రీతో మళ్లీ తెరపైకి వచ్చింది.
Advertisement
తెలంగాణ ప్రజల్ని నిందించిన ఏపీ మంత్రులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పవన్. తెలంగాణ ప్రజల్ని, ప్రాంతాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం తనకు మనస్తాపం కలిగించిందని అన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని.. హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఆ మంత్రిని, వ్యక్తిని ప్రస్తావించాలన్నారు. కానీ, ఈ వివాదంలోకి ప్రజల్ని లాగొద్దని సూచించారు. ఒక జాతి, జాతి అని తిట్టడం సరికాదన్నారు.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎటాక్ మొదలు పెట్టారు. ఏపీని ఉద్దేశించి ఎవరేమన్నా వదిలేయాలా.. అయినా పవన్ కళ్యాణ్ కు బీఆర్‌ఎస్ పై కొత్తగా ఈ ప్రేమ ఎందుకు పుట్టిందో అంటూ సరికొత్త డౌట్ వ్యక్తం చేస్తున్నారు. పవన్ ను జనం మర్చిపోతున్నారని అప్పుడప్పుడు ట్వీట్ పెడుతున్నారని ఎద్దేవ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. తెలంగాణ ప్రజలను ఏమీ అనకపోయినా పవన్ తమపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే పవన్ బాధ పడుతున్నారని.. ఈ కొత్త బాధ ఏంటో అర్ధం కావడం లేదన్నారు.
Advertisement
ఇటు బీఆర్ఎస్ మంత్రులు ఏపీ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. బీఆర్ఎస్ తో పవన్ కు రహస్య ఒప్పందం ఏంటి.. వేల కోట్ల ఒప్పందం జరిగిందని మీడియాలో చూశా.. ఇది బహుశా నిజమేనేమో అని విమర్శించారు. పవన్ తెలంగాణలో బీఆర్ఎస్ తో ఏపీలో చంద్రబాబుతో ఉన్న లాలూచీ ఏంటంటూ ప్రశ్నించారు.
మరోవైపు ఏపీ నేతలపై ఇంకోసారి మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. కొందరు నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, ఉన్నది అంటే ఉలుక్కి పడుతున్నారని విమర్శించారు. ఏపీ మంత్రులు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు. ‘విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాటం చేయడం లేదు.. పోలవరం పనులు ఎందుకు కావడం లేదని ప్రశ్నించాను. ఇందులో ఏమైనా తప్పుందా? ప్రజల పక్షాన మాట్లాడాను తప్ప.. ఎపీ గురించి తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని చెప్పాను. ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండాలి అని చెప్పాను. మేము ఏపీ గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణలో అన్ని బాగున్నాయి ఇక్కడే ఉండండి అని ఆరోజు అన్నాను’ అని చెప్పుకొచ్చారు హరీష్ రావు.