Advertisement
మాజీ మంత్రి వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ అయ్యాక అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం సీబీఐ కోర్టు విచారణను ప్రారంభించింది. ఈమధ్యే సీబీఐ అధికారులు కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను.. 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకి తరలించారు. ఈక్రమంలో విచారణ స్టార్ట్ చేసింది న్యాయస్థానం.
Advertisement
మొత్తం ఐదుగురు నిందితులు ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరిలకు సమన్లను జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎస్/01/2023 నెంబర్ ను కేటాయించింది సీబీఐ కోర్టు. నిందితులందరూ ఆరోజు హాజరు కావాలని చెప్పింది.
Advertisement
మరోవైపు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లో సీబీఐ అధికారులు విచారించారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. ఇదే కేసులో అరెస్టైన దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అవినాష్ కాల్ డేటా, బ్యాంకు ట్రాన్సక్షన్స్ పై అధికారులు ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. కేసు హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాకే అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుటకు రావాల్సి వచ్చింది.
ఇక విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు ఎంపీ. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐ అధికారులను కోరానని అన్నారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చానని చెప్పారు. అధికారులకు ఉన్న అనుమానాలపై తన సమాధానాలతో నివృత్తి చేశానన్నారు. మళ్లీ ఎప్పుడు విచారణకు హాజరు రమ్మన్నా వస్తానన్న ఆయన.. ప్రజలకు కేసుకు సంబంధించిన వివరాలు తెలియాలని వీడియో అనుమతి కోరానని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన విషయాలు ఏవీ ఇప్పుడు బహిర్గతం చేయలేనన్నారు. కొన్ని మీడియా సంస్థలు పని గట్టుకుని తనపై దృష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు అవినాష్ రెడ్డి.