Advertisement
ఓవైపు హిందీ భాషపై రచ్చ నడుస్తున్న ఈ సమయంలో ఇంగ్లీష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. దేశంలో స్థానిక భాషల వినియోగాన్ని సమర్ధించారు. ఇంగ్లీష్ అనేది కేవలం సమాచార మాధ్యమం మాత్రమేనన్నారు. ఇంగ్లీషు మాట్లాడినంత మాత్రాన మేధావులైనట్టు కాదని చెప్పారు. పేద తల్లిదండ్రుల పిల్లలు ఇంగ్లీష్ లో చదువుకోకపోయినా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంగ్లీష్ భాష లేకపోవడం వల్ల ఎవరూ వెనుకబడకుండా చూడాలని మోడీ అన్నారు.
Advertisement
Advertisement
దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. అందువల్లే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు మోడీ. ఇది వరకు ఆంగ్ల భాష మాట్లాడితే అదో పెద్ద మేధావితత్వానికి బెంచ్ మార్క్ గా పరిగణించేవారని, నిజానికి అది ‘మీడియం ఆఫ్ కమ్యూనికేషన్’ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో ఇంగ్లీష్ అవరోధంగా ఉందని, గ్రామాల నుంచి చాలా మంది ప్రతిభావంతులు అది రాని కారణంగా వైద్యులు, ఇంజనీర్లు కాలేకపోతున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం ఆంగ్ల భాష చుట్టూ ఉన్న ఈ బానిస మనస్తత్వం నుండి దేశాన్ని బయటకు తెస్తుందన్నారు. అలాగే దేశంలో కొత్తగా ప్రారంభించిన 5జీ టెలికాం సేవలు విద్యా వ్యవస్థను తర్వాతి స్థాయికి తీసుకెళ్తాయని తెలిపారు. 5జీ సేవ స్మార్ట్ సౌకర్యాలు, స్మార్ట్ క్లాస్ రూమ్ లు, స్మార్ట్ బోధనలకు మించి ఉంటుందన్నారు. ఇది మన విద్యా వ్యవస్థను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని తెలిపారు ప్రధాని.