Advertisement
మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్. భారత సైన్యంలో యువతకు మరిన్ని అవకాశాలు దక్కేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు. అగ్నిపథ్ లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును బట్టి 25 శాతం మందిని రిటెయిన్ చేసుకుంటారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.
Advertisement
ఈ పథకానికి మొదట్నుంచి వివాదాలు చుట్టుకున్నాయి. పాత పద్దతిలోనూ రిక్రూట్ మెంట్ జరగాలని దేశవ్యాప్తంగా యువత ఆందోళన బాటపట్టారు. బస్సులు, రైళ్లను తగులబెట్టారు. ప్రభుత్వ ఆస్తి నష్టం భారీగానే జరిగింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. విచిత్రం ఏంటంటే.. ఈ పథకం కింద రిక్రూట్ మెంట్ మొదలవ్వగానే భారీగా అప్లికేషన్లు వచ్చాయి.
Advertisement
అయితే.. ఈ అగ్నిపథ్ ను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఆపార్టీ నేత ప్రియాంక గాంధీ ప్రకటించడం సంచలనంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికార పగ్గాలను చేబడితే దేశ యువతకు వ్యతిరేకంగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు ప్రియాంక. అగ్నిపథ్ ను రద్దు చేయాలని విపక్షాలు కోరినా బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
హిమాచల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, రాష్ట్రంలో 5 లక్షలమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ గెలిస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని వాగ్దానం చేశామని.. అది అమలవుతోందని వివరించారు. నిధుల కొరత వల్ల హిమాచల్ లో పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఇది కుంటి సాకు మాత్రమేనని ప్రియాంక గాంధీ ఆరోపించారు.