Advertisement
పాదయాత్ర.. ఏపీ ప్రజలకు బాగా తెలిసిన పదం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, షర్మిల, జగన్ ఇలా ఎన్నికల సమయంలో ఓట్లే లక్ష్యంగా పాదయాత్ర నిర్వహించారు. పైకి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే అని చెప్పినా.. ఓట్లు రాబట్టడంలో దాని ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. అందుకే ఈసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమౌతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభింస్తారని.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఇది కొనసాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైందట. 2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేయబోతున్నారు లోకేశ్. ఈ యాత్ర 2024 మార్చిలో ముగిసే విధంగా షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికలు అదే ఏడాది మేలో జరుగుతాయి. మార్చి, ఏప్రిల్ లో షెడ్యూల్ వస్తుంది. ఆ షెడ్యూల్ వచ్చేనాటికి పాదయాత్ర ముగిసేలా ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్ర ముగిసిన వెంటనే ఎన్నికల ప్రచారం చేసేలా టీడీపీ రోడ్ మ్యాప్ రెడీ చేస్తుందని సమాచారం.
Advertisement
నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుందని తెలుస్తోంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారట. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేశ్ పాదయాత్ర ముందుకు సాగుతుదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం కామన్ గా మారింది. 2014కు ముందు చంద్రబాబుతో పాటు జగన్ జైలులో ఉండటం వల్ల షర్మిల పాదయాత్ర చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో జగన్ పాదయాత్ర చేశారు. అప్పుడు ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి ఉన్నందున వారానికి ఆరు రోజుల పాదయాత్రే చేశారు.
ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు లోకేశ్ రంగంలోకి దిగుతున్నారు. నిరుద్యోగులతో పాటు పాదయాత్రలో రైతులు, మహిళల సమస్యలపైనా లోకేశ్ ప్రధానంగా ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది. నిజానికి సంక్రాంతి తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే నుంచి లోకేశ్ పాదయాత్ర ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే.. తన లక్కీ నెంబర్ 9 కావడంతో ఆయనకు కలిసివచ్చేలా 27 నుంచి పాదయాత్ర ప్రారంభించాలని డిసైడ్ చేశారని సమాచారం.