Advertisement
ప్రధాని మోడీ మూడు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఇంకోవైపు రాజకీయ సభకు హాజరయ్యారు. ముందుగా అరుణాచల్ ప్రదేశ్ లో తొలి ‘గ్రీన్ ఫీల్డ్’ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. రాజధాని ఈటానగర్ లోని హెల్లంగి ప్రాంతంలో నిర్మించిన డోనీ-పోలో విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో తొలి ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చింది. 2019 నవంబర్ లో ప్రధాని మోడీ ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.645 కోట్లతో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది.
Advertisement
Advertisement
ఈటా నగర్ నుంచి వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్లారు మోడీ. అక్కడ కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ఆయన పంచె కట్టులో హాజరయ్యారు. తమిళనాడు, కాశీ మధ్య సంబంధాలను బలపరిచేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోడీ పంచె కట్టులో ప్రత్యేక విమానం నుంచి దిగి నడుస్తూ వస్తున్న ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఎక్కడికి వెళ్లినా స్థానికత ఉట్టిపడేలా డ్రెస్సింగ్ చేసుకుని అందరినీ ఆకట్టుకుంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ మోడీ పాల్గొన్నారు. వాపిలోని కట్టుదిట్టమైన భద్రత నడుమ రోడ్ షోలో పాల్గొన్నారు. మోడీ ర్యాలీతో వాపి రోడ్ జనంతో కిక్కిరిసంది. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలో భారీ ర్యాలీలో మోడీ ప్రసంగించారు. గుజరాత్, బీజేపీ మధ్య బంధం విడదీయరానిదని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ర్యాలీ పాల్గొనడంతోనే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసిపోయిందన్నారు. ఈ జనసంద్రమే బీజేపీ విజయాన్ని చాటిచెబుతోందని తెలిపారు.