Advertisement
ఏపీలో అధికార వైసీపీపై పోరాటం సాగిస్తోంది జనసేన పార్టీ. ప్రజా సమస్యలపై తనదైన రీతిలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోడీతో భేటీ తర్వాత మరింత స్పీడ్ పెంచిన పవన్.. ఇకపై అధిక ప్రాధాన్యం రాజకీయాలకే అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జగనన్నకాలనీల దుస్థితిని అందరికీ తెలిసేలా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ లో ఉన్నారు పవన్. బీజేపీతో కలిసి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
Advertisement
సర్కార్ పై పవన్ చేస్తున్న యుద్ధానికి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సైతం పరోక్షంగా మద్దతు ప్రకటించారు. తన మద్దతు ఎప్పటికీ తమ్ముడికే ఉంటుందని చెప్పకనే చెప్పారు. హైదరాబాద్ లో నర్సాపురం వైఎన్ఎమ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. దీనికి చిరంజీవి హాజరై ప్రసంగించారు. రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చి పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా పాలిటిక్స్ లో తన తమ్ముడిని ఉన్నత స్థానంలో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదన్న చిరు.. చాలా కష్టపడాలని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు.. అవసరమా అని చాలా సార్లు అనుకున్నానన్నారు. పాలిటిక్స్ లో ఉండాలంటే అనేక మందితో మాటలు పడాలి.. అనాలని చెప్పారు. రాజకీయాలకు పవన్ తగిన వ్యక్తని అభిప్రాయపడ్డారు. తనపై చేసే ఆరోపణలకు గట్టి సమాధానం చెప్పలగడని అన్నారు. ప్రస్తుతం పవన్ చాలా బలంగా పోరాడుతున్నారని తెలిపారు. ఎప్పటికైనా ఉన్నత స్థానంలో చూస్తామని చెప్పారు.
ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరు అనేక అవమానాలు పడ్డారు. సినిమాల్లో తనతోపాటు నటించి మీరు గొప్పోళ్లు అని పొగిడినవారే.. పాలిటిక్స్ లో తిట్టారు. కానీ, చిరు వారిని తిరిగి తిట్టిన సందర్భాలు తక్కువే. తనకు ఎదురైన అనుభవాలనే తాజాగా ఆయన ప్రస్తావించారు. కానీ, పవన్ అలా కాదని.. ఏదైనా సాధించేవరకు వదిలిపెట్టడని చెప్పారు. ప్రస్తుతం చిరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలకే పరిమితం అయ్యారు. అయితే.. తమ్ముడికి పూర్తి స్థాయిలో అండగా ఉంటున్నారు.