Advertisement
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈసారి పక్కాగా గెలుస్తామని అధిష్టానానికి తెగ గొప్పలు చెప్పింది రాష్ట్ర నాయకత్వం. అయితే.. పరిస్థితులు చూస్తుంటే అసలు డిపాజిట్లు దక్కుతాయా? అనే సందేహాలు కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. పార్టీని వీడుతున్న నేతలంతా రేవంత్, మాణిక్కం ఠాగూర్ ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ల నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
Advertisement
రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీలో పెద్దగా చేరికలు లేవని టాక్ ఉంది. ఇతర పార్టీల లీడర్లను చేర్చుకునేందుకు జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. కానీ, ఆ కమిటీ చేరికలపై పెద్దగా కసరత్తు చేసిన దాఖలాలు లేవు. అయితే, అత్యంత రహస్యంగా ఢిల్లీకి తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు చివరికి హ్యాండిచ్చి టీఆర్ఎస్ లో చేరారు. నిజానికి రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ పెంచే కార్యక్రమాలు తప్ప, పార్టీకి పనికివచ్చే ప్రోగ్రామ్స్ చేయడం లేదనేది సీనియర్ల వాదన. పార్టీని వీడేవాళ్లంతా ఇదే చెబుతున్నారు.
Advertisement
కాంగ్రెస్ ను ఎవరు వీడినా రేవంత్ మౌనంగానే ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి సంఘటనే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఆయన పార్టీ వీడుతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రేవంత్ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో మర్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేసింది. శశిధర్ రెడ్డికి మరింత చిర్రెత్తుకొచ్చి రేవంత్, ఠాగూర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈక్రమంలో పార్టీని గాడిన పెట్టలేకపోవడం, అందర్నీ కలుపుకుని పోవడంలో రేవంత్ విఫలమవుతున్నారన్న భావన ఏర్పడటంతో హైకమాండ్ రంగంలోకి దిగిందనే ప్రచారం మొదలైంది.
తెలంగాణ బాధ్యతలను ఇక స్వయంగా చూసుకోవాలని ప్రియాంకా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. సీనియర్లు రేవంత్ ను ఎందుకు అంగీకరించలేకపోతున్నారు.. ఆయన కలుపుకుని పోవడానికి ఆసక్తి చూపించడం లేదా? లేక.. వారే కలవడం లేదా అన్న అంశాలపై పరిశీలన జరుపుతున్నారట. దీంతోపాటు కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను తొలగించేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఏదైనా తనకే రిపోర్టు చేయాలని ప్రియాంకా గాంధీ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓసారి ఢిల్లీలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారామె. అయితే.. రేవంత్ పై అతి నమ్మకం ఉంచి.. ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకోలేదు. కానీ, సీనియర్లు ఆయన్ను అంగీకరించలేకపోతున్నారు. దీంతో ప్రియాంకా గాంధీ లీడ్ తీసుకున్నారని.. పరిస్థితుల్లో మార్పు వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నట్లుగా చర్చ సాగుతోంది.