Advertisement
వివాదంలో ఉండాలని అనుకుంటారో.. వివాదం అవ్వాలని మాట్లాడతారో తెలియదు గానీ.. తరచూ ఏదో ఒక గొడవలో రాందేవ్ బాబా పేరు మార్మోగుతుంటుంది. తాజాగా ఆయనపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. దానికి పెద్ద కారణమే ఉంది. ముంబైలోని థానేలో పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రాందేవ్.. కాస్త ఓవర్ గా మాట్లాడారు.
Advertisement
మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ సూట్లలోనూ అంతే బాగా అందంగా కనిపిస్తారని చెప్పారు. అంతటితో ఆగకుండా తన కండ్లకు ఏ దుస్తులు ధరించకున్నా కూడా బాగుంటారని అన్నారు రాందేవ్. యోగా తరగతులకు వస్తున్న మహిళలను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళా సంఘాలు బాబాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్ లో రాందేవ్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో మాజీ మంత్రి గీతారెడ్డి, మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాందేవ్ బాబా వెంటనే క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ మాట వేరే పార్టీ వాళ్ళు అని వుంటే ఇప్పటికే బత్తాయిలు… హిందూ వ్యతిరేకి, దేశ ద్రోహి అని రచ్చ చేసేవారని విమర్శలు చేశారు.
Advertisement
రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి సమక్షంలో బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు అమర్యాదకరంగా ఉన్నాయని, ఖండించదగినవని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు మహిళలందరినీ బాధించాయన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు రాందేవ్ దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు.
ఇక బాబా రాందేవ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాస్త ఘాటుగా స్పందించారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతో పాటు.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి.. పతంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. యోగా పేరుతో అందరి దగ్గర సానుభూతి నటిస్తూ వెనకాల కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నారని ఆరోపించారు.మహిళలు నగ్నంగా ఉంటే బాగుంటారనే వ్యాఖ్యలు దారుణమన్న ఆయన.. మహిళా వ్యతిరేక చట్టం కింద ఆయనను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అక్కడున్న మహిళలు ఆయనను చెప్పుతో కొడితే బాగుండేది వ్యాఖ్యానించారు నారాయణ.
శివసేన నేత సంజయ్ రౌత్ కూడా దీనిపై స్పందిస్తూ.. బాబా రాందేవ్ వ్యాఖ్యలపై అమృతా ఫడ్నవీస్ ఎందుకు నిరసన తెలియజేయలేదని ప్రశ్నించారు.