Advertisement
ఢిల్లీలో ఎంతో అట్టహాసంగా బీఆర్ఎస్ తాత్కాలిక భవనాన్ని తెరిచారు సీఎం కేసీఆర్. శాశ్వత భవనానికి ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉండడంతో తాత్కాలిక బిల్డింగ్ ను ప్రారంభించారు. ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నేతలతోపాటు కొందరు రైతు నాయకులు పాల్గొన్నారు. వారితోపాటు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నేతలందరూ హాజరయ్యారు. రెండు రోజులపాటు సర్దార్ పటేల్ మార్గ్ లోని బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది.
Advertisement
ఓవైపు పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం ఆనందంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు ఇంకోవైపు విమానయాన సంస్థలు షాకిచ్చాయి. ప్రారంభోత్సవానికి ఉత్సాహంగా వెళ్లిన నేతలు ఉసూరుమంటూ తిరిగొస్తున్నారు. దానికి కారణం.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చే విమానాల టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడమే. వాటిని చూసి బీఆర్ఎస్ నేతలకు షాక్ తగిలినంత పనయింది.
Advertisement
మూకుమ్మడిగా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లడంతోనే టికెట్ ధరలు పెరిగాయని ప్రచారం జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగింతలు పెరిగాయి. అక్కడకు వెళ్లిన నేతలు పెద్దఎత్తున తిరుగు ప్రయాణం అవుతారని అంచనా వేసి విమానాయన సంస్థలు ధరలు పెంచాయని అనుకుంటున్నారు. అయితే.. బీఆర్ఎస్ నాయకులు ఏం తక్కువ తినలేదు.
ఢిల్లీ వెళ్లిన అందరు నేతలు నగరానికి రావడం లేదు. చాలామంది అక్కడే ఉండిపోయారు. విమాన ధరలు చూసి ఆగిపోయారు. ధరలు తగ్గాక రేపో, ఎల్లుండో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవ్వాలని వారంతా ఆగినట్లుగా మాట్లాడుకుంటున్నారు.