Advertisement
చార్లెస్ శోభరాజ్… బికినీ కిల్లర్ గా పేరు పొందిన ఇతను క్రైమ్ కింగ్ గా పేరొందాడు. సీరియల్ హత్యల్లో ఆరితేరాడు. ఎన్నో దేశాల్లో ఇతడిపై కేసులున్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం నేపాల్ లోని ఓ జైలులో ఖైదీగా ఉన్నాడు. అయితే.. అక్కడి సుప్రీంకోర్టు ఇతడిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం చార్లెస్ శోభరాజ్ పేరు మార్మోగుతోంది.
Advertisement
సుప్రీంకోర్టు జడ్జీలు సప్నా ప్రధాన్ మల్లా, తిల్ ప్రసాద్ జ్యేష్ఠలతో కూడిన బెంచ్.. ఇతడిని విడుదల చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం చార్లెస్ వయసు 78 ఏళ్ళు. ఈ కారణంగానే అతడిని రిలీజ్ చేయాలని కోర్టు నిర్ణయించింది. కానీ, ఇతడ్ని విడుదల చేసేందుకు నేపాల్ జైలు అధికారులు నిరాకరించారు. విడుదల చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో పస లేదని.. ఏ కేసులో విడుదల చేయాలన్నది స్పష్టంగా లేదని వారు పేర్కొన్నారు.
Advertisement
2003లో శోభరాజ్ ను నేపాల్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. 19 ఏళ్ళుగా జైలులో ఉన్నాడు. తన భర్త విడుదల కానున్నాడని తెలిసిన అతని భార్య నిహితా బిస్వాస్ ఎంతో సంతోషించింది. కానీ, జైలు అధికారులు నిరాకరించారని తెలిసి కుంగిపోయింది. చార్లెస్ 64 ఏళ్ళ వయసులో ఉండగా.. 21 ఏళ్ళ నిహితాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్యా అంత వయసు గ్యాప్ ఉన్నా వీరి ప్రేమకు అది అడ్డు రాలేదు. శోభరాజ్ కి, ఈమెకు జైల్లోనే పరిచయమై అది ప్రేమకు, పెళ్ళికి దారి తీసింది.
శోభరాజ్ క్రైమ్ హిస్టరీ
చార్లెస్ శోభరాజ్ 1944లో వియత్నాంలోని హూచిమిన్ నగరంలో జన్మించాడు. భారత్, నేపాల్, మయన్మార్, థాయ్ లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల్లో ఇతనిపై కేసులున్నాయి. ఎక్కువకాలం నాలుగు దేశాల్లో మాత్రమే చార్లెస్ ఖైదీగా జీవితాన్ని కొనసాగించాడు. 70వ దశకంలో ఆగ్నేయాసియాలో 12 మంది పర్యాటకులను హత్యచేశాడు. నీటిలో ముంచడం, గొంతు నులిమి చంపడం, కత్తితో లేదా సజీవదహనం చేసి చంపడం ఇతడి స్టైల్. బీచ్ లలో బికినీ ధరించిన టూరిస్ట్ అమ్మాయిలను ఎక్కువగా చంపేవాడు. అందుకే బికినీ కిల్లర్ అని పేరొచ్చింది. ఢిల్లీలో ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి హత్య చేసిన కేసులో భారత్ లోనూ జైలు శిక్ష అనుభవించాడు చార్లెస్. 1976 నుంచి 1997 వరకు ఇక్కడి జైలు జీవితాన్ని అనుభవించాడు. 1986లో జైలు నుంచి తప్పించుకున్నప్పటికీ.. పోలీసులు అతన్ని గుర్తించి మళ్లీ జైలుకు పంపించారు.