Advertisement
ఈమధ్య టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దీనిపై రకరకాల వాదనలు, చర్చలు, అనుమానాలు తెరపైకి వచ్చాయి. అయితే.. సంబంధం లేకపోయినా కలగజేసుకుని నానా తిట్లు తిట్టాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. చంద్రబాబు, పవన్ అంటే ఉన్న కోపమో.. జగన్ అంటే అభిమానమో గానీ.. కులాల ప్రస్తావన తీసుకొచ్చి మరీ ఆడిపోసుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత, నటుడు నాగబాబు రియాక్ట్ అయ్యారు. అదేస్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు.
Advertisement
తన దృష్టిలో రాంగోపాల్‌వర్మ పెద్ద వెధవ.. సన్నాసి.. అలాంటి వారి గురించి మాట్లాడబోను అంటూ ఘాటుగా స్పందించారు నాగబాబు. మాట్లాడినంతసేపు ఆర్జీవీని వాడు అనే సంభోదించారు. అతను అవసరం కోసం ఎంతకైనా దిగజారుతాడని ఫైరయ్యారు. తాను కాపు కులంలో పుట్టాను.. కాపు కులంతో పాటు అన్ని కులాలను గౌరవిస్తాను.. కానీ, కులపిచ్చి లేదన్న వర్మ.. ఒక కులం గురించి అలా మాట్లాడడం తప్పు అని హితవుపలికారు. కాపులకు ఆత్మాభిమానం లేదా? అని ప్రశ్నించారు.
Advertisement
అసలు ఏ కులమైనా ఎందుకు అమ్ముడు పోతుందని నిలదీశారు నాగబాబు. అందరికీ ఆత్మాభిమానం ఉంటుందన్న ఆయన.. ఎన్టీఆర్ ని, చంద్రబాబుని, వైఎస్ ని.. ఇప్పుడు సోకాల్డ్ అడ్డగాడిదలను కూడా గెలిపించింది కాపులే అని గుర్తు చేశారు. అసలు కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు తమకు ఎక్కడుందని కడిగిపారేశారు నాగబాబు. ఇటు వైసీపీ నేతల వ్యాఖ్యలపైనా స్పందించారు.
ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ పై వైసీపీ నేతలు తరచూ ఆరోపణలు చేస్తుంటారు. వాటిపై మాట్లాడిన నాగబాబు.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్యాకేజీ మీ అమ్మమొగుడిచ్చారా..? అని కొడాలి స్టైల్ లో అడిగారు. కానీ, అలా అననని.. సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే తమకు ప్యాకేజీ అవసరమా? అని సెటైర్లు వేశారు. తమకున్న కొద్దిపాటి డబ్బుని అందరికీ పంచుతున్నామని వెల్లడించారు. ప్యాకేజీ అంటూ వైసీపీ నేతలు బావ దారిద్య్రంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. తాము అన్ని కులాలను గౌరవిస్తామని.. కుల పిచ్చి లేదని స్పష్టం చేశారు.