Advertisement
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం పెద్ద మిస్టరీగా మారింది. ప్రమాదానికి గల కారణాలను ఓవైపు అంచనా వేయలేకపోతుంటే.. ఇంకోవైపు ముగ్గురు కార్మికులు కనిపించడం లేదు. వాళ్లు బతికున్నారా? చనిపోయారా? అనేది మిస్టరీగా మారింది. భవనం మొత్తం పొగ కమ్మేసింది. రెండోరోజు కూడా అధికారులు పూర్తి స్థాయిలో లోపలికి వెళ్లలేకపోయారు. పైగా భవనం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. కూలిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు అధికారులు.
Advertisement
దట్టమైన పొగలో సహాయ చర్యల్లో పాల్గొన్న జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి ధనుంజయ్ రెడ్డి.. సిబ్బంది నర్సింగ్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరిని అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించగా.. గుజరాత్ కు చెందిన మరో ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్ ఆచూకీ గల్లంతైంది. కూలీల సెల్ ఫోన్ లోకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపిస్తున్నాయి. దీంతో వారు సజీవ దహనమయ్యే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. మృతదేహాల జాడ మాత్రం లేదు.
Advertisement
మంటలను అదుపు చేసినా.. భవనంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ సిబ్బంది మాల్ లోపలికి వెళ్లలేకపోయారు. దీంతో డ్రోన్ కెమెరాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. భవనం రెండో అంతస్తులో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు ఈ ప్రమాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈనెల 23న అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రకటన చేశారు. జీహెచ్‌ఎంసీ, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ, ఇతర అధికారులతో ఈ మీటింగ్ ఉంటుందని చెప్పారు. నగరంలో కమర్షియల్ భవనాల నిర్మాణాలు, ఫైర్ అనుమతులు, ఇతర అంశాలపై చర్చించనున్నట్టు అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.