Advertisement
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య నడుస్తున్న పంచాయితీలు అందరికీ తెలుసు. బిల్లుల విషయంలో ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతుంటే.. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేయడం కామన్ అయిపోయింది. ఈమధ్యకాలంలో బడ్జెట్ ప్రసంగం విషయంలో గొడవ సాగింది. చివరకు కోర్టు వరకు వెళ్లి సమస్య సద్దుమణిగింది.
Advertisement
ఎట్టకేలకు గవర్నర్ తమిళిసై తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వినిపించారు. అయితే.. అందులో ఆమె మాట్లాడిన దానికి భిన్నంగా బయట ఉందని ప్రతిపక్షాలు కార్నర్ చేస్తున్నాయి. విపక్ష నేతలు గవర్నర్ ప్రసంగంపై పలు రకాలుగా స్పందించారు.
తమిళిసై ప్రసంగంపై నేతల రియాక్షన్ ఇదే..!
కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
‘‘కేంద్ర నిధులతో చేపట్టిన కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకుంన్నారు. గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం. తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారాయని గవర్నర్ తో చదివించిన రాష్ట్ర ప్రభుత్వం.. బిల్లులందక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని ఎందుకు చెప్పించలేకపోయింది. ఏడాది లోపు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి దాని చుట్టూ వివాదాలను సృష్టిస్తోంది. ఉద్యోగ కల్పనపై అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదం.’’
Advertisement
జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
‘‘గవర్నర్ బయట పులిలా గర్జించి.. అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారు. అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుంది. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే. సీఎం కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్ లో గవర్నర్ నడిచారు. తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం, గవర్నర్ మధ్య రాజీ కుదిరింది. చివరకు తుస్సు మనిపించారు.’’
ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
‘‘భూ ప్రక్షాళన పేరుతో ధరణి అని హడావుడి చేసిన ప్రభుత్వం దానిలోని తప్పులను సరిచేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది రైతుల సర్వే నెంబర్లు తప్పుతడకలతో ఉన్నాయి. దీంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ధరణి గురించి గవర్నర్ ప్రస్తావించకపోవడం బాధాకరం. రైతుల ఆత్మహత్యల గురించి కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు అబద్ధాలు చెప్పించారు. విద్యుత్ కోసం రైతులు వ్యవసాయ క్షేత్రాలలో జాగారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా పేదలకు ఇళ్ళను కట్టించలేదు.’’
కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు
గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం పురోగతి చెందిందని చెప్పడం బాధాకరం. ఎనిమిదేళ్ల విధ్వంసాన్ని అద్భుతమని చూపించే ప్రయత్నం చేశారు. ఫ్లోరైడ్ పీడ వదిలిందన్న గవర్నర్ మాటలు అవాస్తవం. తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు. గవర్నర్ చెప్పినట్లు ప్రాజెక్టు పూర్తైతే 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఎందుకు అందించడం లేదు. గోదావరి, కృష్ణా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు ప్రజలకు మేలు చేయకపోగా.. కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ధి చేకూర్చింది. కృష్ణా జలాల్లో వాటా పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి.’’