Advertisement
ఉత్కంఠ రేపిన మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. భారతీయ జనతా పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో తిరిగి అధికార పగ్గాలను చేపడుతోంది బీజేపీ. కానీ, మేఘాలయాలో మాత్రం సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ సత్తా చాటింది. అయితే.. కాంగ్రెస్ కూటమి మాత్రం ఏ రాష్ట్రంలోనూ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. ఈశాన్యంలో కాషాయం రెపరెపలాడడంతో దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు చేసుకుంది.
Advertisement
ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. మూడు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈశాన్య ప్రాంతం ఢిల్లీ నుంచి, తమ దిల్(హృదయం) నుంచి దూరంగా లేవని ఈ ఎన్నికలు నిరూపించాయని మోడీ అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని దేశానికి, ప్రపంచానికి ఇవి చూపించాయని చెప్పారు.
Advertisement
బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న పని.. నైతికత, కార్యకర్తలకు సహాయపడే స్వభావం.. ఈ మూడు అంశాల సమ్మేళనంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. దేశానికి కొత్త రాజకీయ సంస్కృతిని అందించామని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రాల ప్రగతికి కృషి చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ ఫలితాల్ని అందించినందుకు పార్టీ కార్యకర్తలను తాను అభినందిస్తున్నానని చెప్పారు.
మునుపటి ప్రభుత్వాలు కష్టమైన పనుల నుండి పారిపోయేవని.. కానీ, తాము సవాళ్లను వెంబడించామని అన్నారు ప్రధాని మోడీ. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఈశాన్య రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో ఇంకా విద్యుత్ సౌకర్యం లేదని వివరించారు. ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం అంత సులువైన పని కాదని గత ప్రభుత్వాలకు తెలుసని.. అందుకే శీతకన్ను వేశాయని విమర్శించారు ప్రధాని మోడీ.
అయితే.. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని అంటోంది. పార్టీ అధ్యక్షుడు ఖర్గే స్పందిస్తూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని అన్నారు. ఈమాత్రం దానికి సంబర పడాల్సిన అవసరం లేదని.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని తెలిపారు.