Advertisement
ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూ ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు ఫుల్ ఖుషీలో ఉన్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైసీపీకి సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం పని అయిపోయిందని.. ప్రజలు తిరస్కరిస్తున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈక్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మీడియా ముందుకొచ్చారు.
Advertisement
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన చేశారని విమర్శించారు. మంచి గెలుస్తుంది.. చెడు ఎప్పుడైనా ఓడిపోతుందని ప్రజలు నిర్ణయించారన్నారు. జగన్ పని అయిపోయిందని.. ఆయన మళ్లీ ఏ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని విమర్శించారు. జగన్ కు బాధ్యత లేదని.. మోసాలు చేయడంలో దిట్ట అని ఆరోపించారు.
Advertisement
టీడీపీది జనబలం అయితే.. జగన్ ది ధన బలమని అన్నారు. రౌడీయిజం.. ఎప్పటికీ శాశ్వతం కాదని చెప్పారు. జగన్ చేసిన అరాచకం, విధ్వంసం, రాష్ట్రానికి చేసిన ద్రోహమే అతనిని ఓడిస్తాయని తెలిపారు. 40 ఏళ్లు చూడని అక్రమాలు ఈ నాలుగేళ్లలో చూశానన్న బాబు… ఓటర్ జాబితా మొదలు, ఓటు వేసే వరకు అంతా అక్రమమేనని విమర్శించారు. జగన్ లాంటి దారుణమైన వ్యక్తిని తానెన్నడూ చూడలేదని.. ఆయన ఓ అహంకారి, సైకో అంటూ విమర్శలు గుప్పించారు.
పులివెందులలో తిరుగుబాటు మొదలైందన్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికలు జగన్ వర్సెస్ పబ్లిక్ గా ఉంటుందని జోస్యం చెప్పారు. సీఎం అరాచకాలు కొనసాగాలా? రాష్ట్ర భవిష్యత్తు కావాలా? అని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు. చెడుకు ఎప్పటికైనా ఓటమి ఖాయమని.. వైసీపీ గాలికి వచ్చిన పార్టీ.. గాలికే కొట్టుకుపోతుందని సెటైర్లు వేశారు. ప్రజలను నిత్యం మోసం చేసినా పట్టించుకోరనేది జగన్ ధీమాగా కనిపిస్తోందని.. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్మితే జగన్ అరాచకాలను నమ్మారని మండిపడ్డారు చంద్రబాబు.