Advertisement
జాతీయ రాజకీయాలు రాహుల్ గాంధీ అనర్హత చుట్టూ తిరుగుతున్నాయి. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు అదానీ అంశం, రాహుల్ అనర్హతపై చర్చకు పట్టుబట్టాయి. సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే .. కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులంతా పెద్దఎత్తున రభస సృష్టించారు. ముఖ్యంగా రాహుల్ అనర్హత సమస్యపై చర్చించాలంటూ.. ప్రధాని మోడీ ప్రభుత్వ కక్ష సాధింపునకు నిరసన తెలుపుతూ నల్ల దుస్తులతో సభలో ప్రవేశించారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకుపోయి.. స్పీకర్ ఓంబిర్లాపై పత్రాలను విసిరివేశారు. రాజ్య సభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. రోజంతా ఉభయ సభలు వాయిదాలు పడుతూనే ఉన్నాయి.
Advertisement
ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోని డిస్ క్వాలిఫైడ్ ఎంపీగా మార్చుకున్నారు. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్ చేస్తూ ఇన్ స్టాలో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. ప్రియాంక గాంధీ మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు రాహుల్. ఈ వీడియో షేర్ చేస్తూ.. ‘నిజం, ధైర్యం, త్యాగం – ఇది మా వారసత్వం.. ఇదే మా బలం కూడా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Advertisement
మరోవైపు తుగ్లక్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ సచివాలయం రాహుల్ కు నోటీసు జారీచేసింది. ఏప్రిల్ 22 లోగా ఆయన భవనాన్ని వీడాలని సూచించింది. నిబంధనల ప్రకారం ఓ ఎంపీ అనర్హతకు గురైతే 30 రోజుల్లోగా ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని ఓ కేసులో సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో లోక్ సభ సచివాలయం ఆయన అనర్హతను రద్దు చేసింది.
ఈక్రమంలోనే ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని రాహుల్ కి నోటీసు జారీ అయింది. అయితే.. తనకు విధించిన గడువును పొడిగించాలని రాహుల్.. ఈ కమిటీని కోరవచ్చునని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దాన్ని కమిటీ పరిశీలించవచ్చునన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విపక్షాలు రాహుల్ కి మద్దతుగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ లోపల, బయట ధర్నాలు చేస్తున్న నేతలు.. దేశవ్యాప్తంగా ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు.