Advertisement
రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటు విషయంలో కాంగ్రెస్ పోరాటం మరింత ఉద్ధృతం చేస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 30 వరకు నిరసనలు, ధర్నాలకు పిలుపునివ్వగా కాంగ్రెస్ శ్రేణులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రాహుల్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ.. ఏఐసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 వరకు కాంగ్రెస్ శ్రేణులందరూ వివిధ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తారని తెలిపారు.
Advertisement
తొలిరోజున భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుతంగా రాహుల్ గౌడ ఆధ్వర్యంలో ఓబీసీ సెల్ ధర్నా నిర్వహించిందని.. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీపై ఇన్ని కుట్రలు తగదన్న ఆయన.. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా సేవలందించి, ఎంపీగా చేస్తున్న వ్యక్తిపై అనర్హత ప్రకటించడం అన్యాయమని అన్నారు.
కింది కోర్టు పైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినా.. 24 గంటల లోపే అనర్హుడిగా ప్రకటించడం దుర్మార్గమైన చర్య అని… దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు కోమటిరెడ్డి. ఓబీసీ సెల్ నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాలకు పార్లమెంట్ సభ్యుడిగా తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. రాహుల్ గాంధీ అనర్హత వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేయాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.