Advertisement
కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించి.. పలు పదవులు అనుభవించి చివరకు బీజేపీ గూటికి చేరారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. కేంద్ర పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. వరుసగా బీజేపీ అగ్ర నేతలను కలుస్తున్నారు. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. నడ్డా నివాసంలో ఇది జరిగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. దీనికి అమిత్ షా, బీఎల్ సంతోష్, యడియూరప్ప సహా తదితరులు హాజరయ్యారు.
Advertisement
ముఖ్య నేతల సమావేశం కావడంతో అక్కడికి వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి.. అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ ఇతర నేతలను కలిశారు. అయితే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సడెన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అనేక అనుమానాలను తెరపైకి తెచ్చింది. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, అధిష్టానం పెద్దలతో భేటీలు కానున్నారు వీర్రాజు. రాష్ట్రంలోని పలు అంశాలపై అందుబాటులో ఉన్న పలువురు నేతలతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, నల్లారి చేరిక తర్వాతే వెళ్లడం ఏంటని.. దాని చుట్టూ అనేక ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
Advertisement
తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని వినియోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ భావించినట్టు సమాచారం. మూడు రాష్ట్రాల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలతో ఆయన్ను టచ్ లోకి వెళ్లాలని బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కిరణ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు, జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందని టాక్ నడుస్తోంది. త్వరలో పార్టీలో చేయబోయే మార్పులు చేర్పుల్లో జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు. ఏ మాత్రం వీలున్నా ఈలోగానే అప్పగించే అంశాన్ని పరిశీలిస్తోందట బీజేపీ హైకమాండ్. అందుకే సోము వీర్రాజుకు ఢిల్లీ నుంచి పిలిచి.. కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పని చేయాలని సూచించినట్టుగా ప్రచారం జరుగుతోంది.