Advertisement
ఈమధ్య కాలంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వందల కోట్లు పెట్టి అగ్ర నేతల సినిమాలను వరుసగా తెరకెక్కిస్తున్న మైత్రీ సంస్థ నిర్వాహకుల పెట్టుబడుల వ్యవహారంపై అధికారులు ఆరా తీశారు. మూడు రోజులపాటు వరుసగా ఈ సోదాలు జరిగాయి. అదే సమయంలో నిర్మాత ఎర్నేని నవీన్ అస్వస్థతకు కూడా గురయ్యారు. అయితే.. ఈ సంస్థలో రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
Advertisement
ప్రముఖంగా వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ లావాదేవీల విషయంలో బాలినేని బినామీ, ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావులపై విచారణ జరిపించాలని కోరారు. సదరు నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీల వెనుక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకు సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలున్నాయని వివరించారు.
Advertisement
తనపై జరుగుతున్న ప్రచారంపై బాలినేని స్పందించారు. మైత్రీ సంస్థలో తాను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవమని అన్నారు. జనసేన కార్పొరేటర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. మైత్రీ సంస్థలో తనకు పెట్టుబడులున్నాయో? లేదో? పవన్ దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ, తాను డబ్బులు పెట్టానని నిరూపిస్తే.. ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు బాలినేని.
మైత్రీ సంస్థ నిర్మించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సహకరిస్తే పెట్టుబడులు పెట్టినట్టా? ఆ సినిమాకే కాదు ఏ మూవీ అయినా అవసరం అయితే సహకరిస్తానని తెలిపారు. తమపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. తమ కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారని.. అవాస్తవాలు ప్రచారం చేయటం సరికాదన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.