Advertisement
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈనెల 12న శ్రీకాకుళంలోని రణస్థలిలో జనసేన యువశక్తి బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఓవైపు సభా ఏర్పాట్లు జరుగుతుండగా.. వైసీపీ నేతలు పవన్ ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ నేత, మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పవన్ సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ కలలు కంటున్నారని.. అయితే ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే తానే ప్రొడ్యూస్ చేస్తానని సెటైర్లు వేశారు.
Advertisement
పవన్ కళ్యాణ్ ను తెరపై సీఎంగా చూసుకోవచ్చు.. నిజ జీవితంలో కాలేరనే తరహాలో ఎద్దేవ చేశారు అమర్నాథ్. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు కూడా పవన్ కు తెలియదని.. అలాంటి వ్యక్తి సీఎం అవుతారా అని ప్రశ్నించారు. ఆయన సినిమాల్లో పవర్ స్టార్ కానీ, పాలిటిక్స్ లో ప్యాకేజ్ స్టార్ అంటూ విరుచుకుపడ్డారు మంత్రి.
Advertisement
ఇటు మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ పై ఫైరయ్యారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని చంద్రబాబు అణిచివేసినప్పుడు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. హరి రామజోగయ్య దీక్ష చేస్తేనే పవన్ స్పందించారని.. టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఎందుకు ప్రశ్నిస్తారని నిలదీశారు. ఆయన ద్వంద వైఖరిని అందరూ గమనించాలని సూచించారు.
మరోవైపు మంత్రి రోజా కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పవన్ ప్రజల కోసం పార్టీ పెట్టానని చెప్తారు కానీ, చంద్రబాబు సభల్లో అంతమంది చనిపోయినా.. నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటంలో అక్రమంగా నిర్మించిన గోడలు కూల్చితే ఏదో తప్పు అయినట్లు డబ్బులు ఇచ్చారని, చంద్రబాబు సభలో ప్రాణాలు పోగొట్టున్న వారికి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కానీ, పవన్ కానీ, లోకేశ్ కానీ అధికారమే పరమావధిగా ఉన్నారే తప్ప ప్రజలపై ప్రేమ లేదని పేర్కొన్నారు రోజా.