Advertisement
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక మల్లికార్జున ఖర్గే మాటల దాడిలో స్పీడ్ పెంచారు. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ ఈమధ్య తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏ అంశాన్ని వదలకుండా తిట్టిపోస్తున్నారు. ఈక్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఫైరయ్యారు.
Advertisement
గురువారం అమిత్ షా త్రిపురలో పర్యటించారు. ఈ సందర్భంగా అయోధ్య రామాలయం గురించి మాట్లాడారు. భక్తుల పూజలందుకోవడానికి వచ్చే ఏడాది జనవరి 1 నాటికి ఆలయం సిద్ధమవుతుందని చెప్పారు. రామాలయం నిర్మాణాన్ని కోర్టుల ద్వారా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కు ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు.
Advertisement
ఆలయం ప్రారంభ తేదీని అమిత్ షా చెప్పడం ఏంటని ప్రశ్నించారు ఖర్గే. ఆయన రాజకీయ నాయుకుడని.. పూజారి కాదంటూ సెటైర్లు వేశారు. దేశాన్ని కాపాడటం, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం మీ కర్తవ్యమని అమిత్ షాకు గుర్తు చేశారు. అంతేకానీ ఆలయం గురించి ప్రకటనలు చేయడం కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేయడంలో బీజేపీ బిజీగా ఉందని ఆరోపించారు. తమకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందని పేర్కొన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం బీజేపీ పోరాడలేదన్న ఖర్గే.. ప్రధాన మంత్రి 100 కార్లతో వెళ్తుంటారని.. హోంమంత్రి 50 కార్లతో ప్రయాణిస్తుంటారని.. తాము మాత్రం తమ కార్యక్రమాలకు వెళ్ళడానికి అనుమతులు పొందడానికి పోరాడాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, కానీ ఎవరికీ ఇవ్వలేదని ఆరోపించారు. హర్యానాలోని పానిపట్ వద్ద భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు ఖర్గే. ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.