Advertisement
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ తారాస్థాయికి చేరుతోంది. ఎన్నికలు రేపో మాపో అన్నట్టు నాయకులు మీడియా ముందు తెగ తిట్టుకుంటున్నారు. రోజూ ఏదో ఒక అంశంపై ఇరు పార్టీల మధ్య వివాదం నడుస్తోంది. మొన్నటిదాకా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డ నేతలు.. తర్వాత ఈడీ దాడుల నేపథ్యంలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మరో వివాదం తలెత్తింది.
Advertisement
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి జరిగింది. టీఆర్ఎస్ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దీనికి కారణం.. అరవింద్ తాజా ప్రెస్ మీటే. కవిత బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిగాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఆయన. ఆమె బీజేపీతో కాదు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో టచ్ లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Advertisement
కవిత, కేటీఆర్ లను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్న అరవింద్.. సెకెండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరం లేదన్నారు. దేశంలోనే సిల్లీ సీఎంగా కేసీఆర్ మిగిలిపోయారని.. మోడల్ పాలనంటే బిడ్డకు 20 శాతం, కొడుక్కి 20 శాతం, ఎలక్షన్ కు 20 శాతం కమీషన్లు ఖర్చు పెట్టడమేనా అని విమర్శించారు. ఎంపీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్గాలు తీవ్రస్థాయిలు మండిపడుతున్నాయి. కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఆమె ప్రెస్ మీట్ కు ముందు అరవింద్ ఇంటిపై దాడి జరిగింది.
ముందు ఎంపీ ఇంటి దగ్గర ధర్నా చేశారు. దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. కానీ, నిరసనకారులు తర్వాత రెచ్చిపోయారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బయట ఉన్న కారు అద్దాలు పగులగొట్టారు. ఇంటి కిటికీలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లంతా భయబ్రాంతులకు గురయ్యారు. దాడి సమయంలో అరవింద్ నిజామాబాద్ లో ఉన్నారు.