Advertisement
మాదకద్రవ్యాల అంశంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మొదట్నుంచి యుద్ధం జరుగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ టెస్టులకు సిద్ధమని ప్రకటించడంతో మరోసారి తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. అప్పుడెప్పుడో ఛాలెంజ్ చేస్తే.. ఇప్పుడు సవాల్ స్వీకరించడం ఏంటని కొన్ని అనుమానాల్ని రెయిజ్ చేశారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. చాలా రోజులు గడవడంతో శరీరంలో మత్తు పదార్థాల ఆనవాళ్లేమీ దొరకవనే ధీమాతోనే మంత్రి ఇప్పుడు టెస్టుకు రెడీ అంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ ముఖంలో భయం కనిపిస్తోందని చెప్పారు.
Advertisement
దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు, సవాల్ చేసిన ఇన్ని రోజులకి ఇప్పుడు స్పందించడం ఏంటని ప్రశ్నించారు సంజయ్. తాను సవాల్ చేసినపుడు స్పందించకుండా ఇప్పుడా మాట్లాడేది..రెండు సంవత్సరాల క్రితం ఎప్పుడో పీసీసీ అధ్యక్షుడు సవాల్ చేస్తే ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని అసహనం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
Advertisement
హైదరాబాద్ మాదకద్రవ్యాల కేసుపై సిట్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు బండి. తాను తంబాకు తింటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా.. ఉంటే బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. మత్తు పదార్థాల కేసుపై దర్యాప్తు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో సమాధానం చెప్పాలని.. దీని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. ఏం తప్పులేకుంటే కేసును ఎందుకు ఆపేశారని నిలదీశారు. కేసీఆర్ కుటుంబానికి నరనరాన అహంకారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతల భాష చూసి జనం నవ్వుకుంటున్నారన్న సంజయ్.. హైదరాబాద్, బెంగళూరు మాదకద్రవ్యాల కేసుల్లో తాను ఎవరి పేరు చెప్పలేదన్నారు. కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో ప్రకటించాలని సవాల్ విసిరారు. లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలైందని చురకలంటించారు.వేములవాడ ఆలయానికి రూ.400 కోట్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ సొమ్ము ఎక్కడ? అని కేటీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్.