Advertisement
రెండు రోజులుగా గన్నవరంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తున్నాం. టీడీపీ ఆఫీస్ పై దాడి.. వైసీపీ నేతల పనేనని ఆరోపణలు.. ఇరు పార్టీల ఘర్షణలు.. పోలీసుల బందోబస్తు.. ఇలా గన్నవరం నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే.. టీడీపీ ఆఫీస్ పై దాడి దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా.. కొందర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే, మరికొందరు టీడీపీ నేతలపైనా కేసులు నమోదు చేశారు.
Advertisement
అయితే.. సందట్లో సడేమియా అన్నట్టు ఓ పోలీస్ చేసిన పని సోషల్ మీడియాలో ఫన్నీ చర్చకు దారితీసింది. టీడీపీ ఆఫీస్ లో వైసీపీ వర్గీయులు ఓవైపు దాడికి పాల్పడుతున్న సమయంలో ఓ కానిస్టేబుల్ తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. కార్యాలయంలో ధ్వంసం అయిన వస్తువులను చూసే నెపంతో లోపలికి వెళ్లిన పోలీస్.. టేబుల్ డ్రా లో ఉన్న ఓ సెల్ ఫోన్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ లాంటి బాక్సును తీసుకుని జేబులో వేసుకున్నాడు.
Advertisement
చోరీ తర్వాత అక్కడికి కొందరు రావడం చూసి అప్పటికి కంగారుపడినా.. తనకేం తెలియదన్నట్టుగా ఏదో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. అనంతరం వారితోపాటు అక్కడి నుంచి జారుకున్నాడు. కానిస్టేబుల్ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నెటిజన్లు ఈ వీడియోపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అబ్బా ఎంత నైస్ గా కొట్టేశాడు’’.. ‘‘దొంగ పోలీస్’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఈ వీడియో వెళ్లినట్టు సమాచారం.