Advertisement
ఇంకో 11 నెలల్లో రిటైర్ అవుతాములే అని అనుకుంటుండగా.. తెలంగాణ సీఎస్ సోమేష్ కు ఊహించని షాక్ తగిలింది. క్యాడర్ విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏపీకి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. కానీ, ఆయన మాత్రం తెలంగాణలోనే ఉండిపోయారు. క్యాట్ ను ఆశ్రయించి ఉత్వర్వులు తెచ్చుకున్నారు. దీన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుని హైకోర్టును ఆశ్రయించింది.
Advertisement
తాజాగా కేంద్రం పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. సోమేష్ ఏపీకి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు సీఎస్. తాజా పరిణామాలపై చర్చించారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణలో వివిధ హోదాల్లో కొనసాగారు సోమేష్. సీఎస్ గా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. అలాగే.. రాష్ట్ర రెవెన్యూ, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, భూపరిపాలన కమిషనర్ వంటి కీలక పోస్టులనూ నిర్వహిస్తున్నారు. భూ రికార్డుల కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ధరణి వెబ్ సైట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.
Advertisement
2023 డిసెంబరు 31తో సోమేష్ పదవీకాలం ముగుస్తోంది. అయితే.. కోర్టు తీర్పు తర్వాత కేంద్రం వెంటనే కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఏపీకి వెళ్లిపోవాలని.. 12 లోగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది. పదవీకాలం తక్కువే ఉండడంతో ఆయన వీఆర్ఎస్ తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.
మరోవైపు సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే.. న్యాయవాద వర్గాల నుంచి ఏం చేసినా ఉపయోగం ఉండదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమేష్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పుడు ఆయన వెళ్తే కొత్త సీఎస్ ఎవరనే దానిపైనా చర్చ జరుగుతోంది.