Advertisement
సార్వత్రిక ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను సెమీ ఫైనల్ అంతా భావించారు. అధికార, విపక్ష పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం సాగించాయి. కానీ, చివరకు ఓటర్లు టీఆర్ఎస్ ను గెలిపించారు. నిజానికి ఈ విజయం అంత ఈజీగా దక్కలేదు. సిట్టింగ్ స్థానం కాకపోయినా.. టీఆర్ఎస్ ఈ సీటును ఎలా దక్కించుకోగలిగింది. ఓటర్లను ఎలా నమ్మించింది. ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి.
Advertisement
కాంగ్రెస్ కు ఇది సిట్టింగ్ స్థానం అయినా.. మూడో ప్లేస్ లో ఉండిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు టీఆర్ఎస్ కే పట్టం కట్టారు ఓటర్లు. ఈ విజయంలో కేసీఆర్ వ్యవహరించిన అన్ని వ్యూహాలు సత్ఫలితాలను ఇచ్చాయి. రాజగోపాల్ రెడ్డికి మంచి పట్టున్న ఈ సీటును దక్కించుకోవడం కష్టమని కేసీఆర్ ముందే గ్రహించారు. అందుకే దాని తగ్గ వ్యూహాలను రచించారు. ముందుగా.. నియోజకవర్గంలో బలంగా ఉన్న వామపక్ష ఓటర్లపై కన్నేశారు. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం రాజగోపాల్ కు మద్దతు పలికాయి. దానికి కారణం కాంగ్రెస్ తో ఉన్న దోస్తీనే కారణం. కానీ, ఇప్పుడు రాజగోపాల్ బీజేపీలో చేరడంతో వామపక్ష పార్టీలకు శత్రువయ్యారు. ఇదే అదునుగా ఆ పార్టీలతో చర్చలు జరిపి తనవైపు తిప్పుకున్నారు కేసీఆర్.
Advertisement
టీఆర్ఎస్ క్యాడర్ కు వామపక్ష పార్టీల ఓట్లు యాడ్ అయ్యాయి. కానీ, ఇదొక్కటే సరిపోదు. ఏ ఉప ఎన్నికలోనూ కేసీఆర్ రంగంలోకి ప్రత్యక్షంగా దిగింది లేదు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించారు. నియోజకవర్గ బాధ్యత తనదని ప్రజలకు హామీ ఇచ్చారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని.. ఆలోచించి ఓటేయండని సెంటిమెంట్ ను రగిలించారు. ఇది బాగా వర్కవుట్ అయింది. మరోవైపు ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు టీఆర్ఎస్ నేతలందరినీ రంగంలోకి దింపారు.
గెలుపే లక్ష్యంగా గ్రామానికో గులాబీ లీడర్ ను నియమించారు కేసీఆర్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు.. ఇలా పార్టీలోని ప్రధాన లీడర్లందరినీ నియోజకవర్గంలోనే ఉంచారు. ఊరికో ఇంచార్జ్ ని పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచించారు. ప్రతీ ఓటర్ ను కలిసేలా చేశారు. ఈ క్రమంలోనే ప్రలోభాల పర్వం భారీగా సాగిందని ఆరోపణలు వచ్చాయి. కొందరు ఓటర్లు టీఆర్ఎస్, బీజేపీ డబ్బులు పంచాయని బహిరంగంగానే మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయి. మొత్తానికి మునుగోడులో గెలుపు కోసం కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డినట్టు అర్థం అవుతోంది.