Advertisement
దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే పండుగ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసంలో 15వ రోజున వచ్చే ఈ పండుగ వెనుక చాలా చరిత్ర ఉంది. ఈ పండుగని హిందువులతో పాటు జైనులు కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరం అని శాస్త్ర వచనం. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడాా అంటారు. ఈ మాసంలో చేసే ప్రతి మంచి/ చెడు రెండు ఫలితాలను సాధారణం కంటే అధిక రెట్లు ఫలితాన్ని ఇస్తాయి.
Advertisement
ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాలు విశిష్ట ఫలితాలను ఇస్తాయి. ప్రతి సంవత్సరం లాగా గంగా, యమునా, గోదావరి మొదలైన పవిత్ర నదులలో స్నానానికి వెళ్తారు. ఇలా చేయడం వలన పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం మంగళకరమని శాస్త్రాలు చెబుతున్నాయి. వీలుకానిచో ఇంటిలో ఉన్న నీటితోనే స్నానం చేసి దానినే గంగ స్నానంగా భావించాలి. కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి, జపాలు ముగించుకొని గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో ఆవు నెయ్యి, లేదా నువ్వుల నూనెతో దీపాలని వెలిగించాలి.
Advertisement
రోజంతా ఉపవాసం ఉండి.. సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు భక్తులు. అయితే పూజ గదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండాలని పెద్దలు చెబుతారు. కానీ సమయం కుదరకో, ఓపిక లేకో రోజూ అలా దీపం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. అందుకోసం కార్తీక పౌర్ణమి రోజున మంచి ఫలితాలను పొందాలనుకునే వారు సంవత్సరంలో ఉన్న రోజులన్నింటికీ ప్రతిగా ఈ రోజున 365 వత్తులను వెలిగించమని చెబుతారు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. కొందరు శివాలయాలలో దీపాలు వెలిగిస్తే.. ఆ అవకాశం లేనివారు ఇంటిలోనే తులసి కోట ఎదుట దీపం వెలిగించవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.