Advertisement
రాజకీయ మార్పు, ప్రశ్నించడం కోసం జనసేన పార్టీ ఆవిర్భవించిందని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతుంటారు. నీతివంతమైన రాజకీయాల ఉద్దేశంతో.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అంటుంటారు. అయితే.. జనసేన పార్టీ ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. పదో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. మచిలీపట్నంలో ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు చేసింది జనసేన. ఇందులో పవన్ ఏం మాట్లాడనున్నారనే ఉత్కంఠ నెలకొంది.
Advertisement
ఇంకొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉండనున్నాయి. తర్వాతి ఆవిర్భావ సభకు ఎలక్షన్ మూడ్ ఉంటుంది. ఈ ఏడాది ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో జనసేన చేపట్టబోయే కార్యక్రమాలు.. ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసే ఛాన్స్ ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో తన సత్తా చాటాలని భావిస్తున్న పవన్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే.. ఈ సభ నేపథ్యంలో పోలీసులు అతిగా ఆంక్షలు పెడుతున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు.
Advertisement
ఈమధ్య బహిరంగ సభలపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలు దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సభకు కాస్త ఇబ్బంది ఎదురైంది. అయినప్పటికీ పోలీసుల ఆంక్షలు లెక్కలోకి తీసుకుంటూ పవన్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వంద ఎకరాల్లో సభ పార్కింగ్ అన్నీ పక్కాగా ఉండేలా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 35 ఎకరాలలో సభాస్థలి ఉంటుంది.
సభ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. ఈక్రమంలో పవన్ పర్యటనలో స్పల్ప మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా అనుకున్న ప్రకారం పవన్ తన యాత్రను మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించడం లేదు. శాసన సభకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారాహి యాత్ర ప్రారంభం అయ్యే స్థలాన్ని విజయవాడ ఆటోనగర్ కు మార్చారు.
మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు పవన్ వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం సభాస్థలికి బయలుదేరుతారు. ముందుగా ఎంపిక చేసిన ఐదు ప్రాంతాల్లో వారాహికి స్వాగతం పలుకుతారు. యాత్రలో మార్పు స్థలాన్ని జన సైనికులు, వీర మహిళలు గమనించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. సభా స్థలంలో లక్షా ఇరవై వేల మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే జనసైనికులకు మజ్జిగ, మంచినీరు, స్నాక్స్, ఆహారం అందించే విధంగా 2 వేల మందితో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు.