Advertisement
సినిమాల్లో ఓ సాంగ్ లోనే పేదవాడు కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించడం చూపిస్తుంటారు. ఇది కాస్త కామెడీగా అనిపించినా.. పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించొచ్చు అనే దానికి ఉదాహరణగా చూపిస్తుంటారు దర్శకులు. అయితే.. రియల్ గా 9 నెలలపాటు ఓ ఎంపీ పడిన శ్రమ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఆయన పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Advertisement
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ ఎంపీగా ఉన్నారు అనిల్ ఫిరోజియా. ఈయన చాలా బరువుండే వారు. ఫిబ్రవరి టైమ్ లో 127 కిలోల వరకు ఉన్నారు. ఆ సమయంలో మాల్వాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.5వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అనిల్ బరువు గురించి మాట్లాడారు. ఉజ్జయిని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ నిధులు కావాలని పదే పదే అడుగుతున్నారని.. ఆయన ఎన్ని కిలోల బరువు తగ్గితే కిలోకు రూ.వెయ్యి కోట్ల చొప్పున కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
Advertisement
పబ్లిక్ మీటింగ్ లో గడ్కరీ మాట ఇవ్వడంతో సీరియస్ గా తీసుకున్నారు ఎంపీ. ఆ రోజు నుంచే బరువు తగ్గడంపై దృష్టి పెట్టారు. రోజూ జిమ్ లో వర్కవుట్లు చేశారు. అలా జూన్ నాటికి ఆయన 112 కిలోలకు చేరుకున్నారు. నిధులు మంజూరు చేయాలంటూ ఆ సమయంలో గడ్కరీకి విన్నవించుకున్నారు. దాంతో అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా వినిపించారు.
ఆ తర్వాత కూడా బరువు తగ్గుతూనే ఉన్నారు అనిల్. ప్రస్తుతం 95 కిలోలకు చేరుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం గడ్కరీ ఇప్పటివరకు రూ.2,300 కోట్ల అభివృద్ధి పనులను ఆమోదించారు. ఇంకా బరువు తగ్గి తన నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకురావాలని ఎంపీ భావిస్తున్నారు.