Advertisement
భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు ఎన్నో ఏళ్లు పాలించారు. అయితే.. ఇన్నేళ్లకు వాళ్ల దేశాన్ని భారతీయ మూలాలున్న వ్యక్తి పాలించడానికి సిద్ధమయ్యాడు. బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన ఆయన బ్రిటన్ రాజకీయాల్లో చరిత్ర లిఖించారు. ఆ దేశ హిస్టరీలో భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రధాని కావడం ఇదే తొలిసారి.
Advertisement
కన్సర్వేటివ్ పార్టీకి చెందిన 190 మంది ఎంపీలు రిషిని తమ నేతగా ఎన్నుకున్నారు. దీంతో పెన్నీ.. బరినుంచి తప్పుకున్నారు. ఈమెకి కనీసం 100 మంది ఎంపీలు కూడా మద్దతు ప్రకటించలేదు. తాను రేసు నుంచి వైదొలగుతున్నానని, దేశ ప్రధానిగా సునాక్ కి పూర్తి మద్దతునిస్తానని ఆమె ట్వీట్ చేశారు. సునాక్ బ్రిటన్ కి 57వ ప్రధాని. మొదట పీఎం రేసులో ఉంటారని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినా.. ఆయన తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్లమెంటులో కన్సర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించే శక్తి తనకు లేదని పేర్కొన్నారు. ఈనెల 20 న మాజీ ప్రధాని లిజ్ ట్రస్ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఈ పోస్టుకు తాను పోటీ చేస్తానని రిషి ప్రకటించారు. దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తానన్న ఆయన హామీని కన్సర్వేటివ్ ఎంపీలంతా గట్టిగా విశ్వసించారు. ఎందుకంటే 2020 సంక్షోభంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని అనేక సవాళ్ల నుంచి సక్రమంగా ముందుకు నడిపించారు.
Advertisement
ఇంగ్లాండ్ లోని సౌథంప్టన్ రిషి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలోని భిన్న ప్రాంతాల నుంచి బ్రిటన్ వలస వచ్చారు. వారి మూలాలు భారత్ లోని పంజాబ్ లో ఉన్నాయి. రిషి తండ్రి యశ్వీర్ కెన్యా నుంచి, రిషి తల్లి ఉష టాంజానియా నుంచి బ్రిటన్ కు వెళ్లారు. రిషి ఆర్థిక రంగంలో తన కెరియర్ ను ప్రారంభించారు. వేసవి సెలవుల్లో సౌథంప్టన్ కర్రీ హౌస్ లో వెయిటర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్ ఫర్డ్ లో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదువుకున్నారు. స్టాన్ ఫర్డ్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
2001 నుంచి 2004 మధ్య గోల్డ్ మన్ సాక్స్ లో విశ్లేషకుడిగా పనిచేశారు రిషి. రెండు హెడ్జ్ ఫండ్స్ లలోనూ విధులు నిర్వర్తించారు. 2014 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిచ్ మండ్ నుంచి పోటీచేసి గెలిచారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఆ స్థానంలో గెలిచారు. మొదట కేంద్ర సహాయక మంత్రిగా, ఆ తర్వాత ఛాన్సలర్ గా పనిచేశారు. బ్రిటన్ క్యాబినెట్ లో ఛాన్సలర్ అనేది రెండో ముఖ్యమైన మంత్రిత్వ శాఖ. ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషికి రికార్డ్ ఉంది. 2020లో ఆర్థికశాఖ పగ్గాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ దేశానికే ప్రధానిగా ఎన్నికయ్యారు.