Advertisement
నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ప్రధాని మోడీ కూడా సంతాపం తెలియజేశారు. ‘‘ప్రసిద్ధ సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని ట్వీట్ చేశారు.
Advertisement
కైకాల కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించారు. 1951 వరకూ అమ్మమ్మ వాళ్ల ఇంట్లోనే పెరిగారు. హై స్కూల్ చదువు గుడ్లవల్లేరులో, కళాశాల విద్య గుడివాడ కాలేజ్ లో జరిగింది. 1955లో బీఏ డిగ్రీ పొందారు. చిన్నతనం నుంచి నాటకాలంటే చెప్పలేనంత అభిమానం. అందుకే ఓవైపు కాలేజీలో చదువుకుంటూనే ఇంకోవైపు స్నేహితులతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారు. సినిమాల్లో నటించాలనే కోరికతో 1956లో మద్రాసు వెళ్లారు. మొదట్లో బాగున్నావు.. నీకు మంచి భవిష్యత్ ఉంది అనేవారే తప్ప ఒక్క వేషం ఇచ్చినవారు లేరు. చివరకు నిర్మాత డీఎల్ నారాయణ ఏకంగా సత్యనారాయణకు ‘సిపాయి కూతురు’ చిత్రంలో హీరో వేషం ఇచ్చి భుజం తట్టారు. జమున ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. అలా వెండితెరకు పరిచయం అయ్యారు.
Advertisement
శ్రీ కనకదుర్గ పూజా మహిమ సినిమాలో తొలిసారి విలన్ పాత్ర పోషించారు. అక్కడినుంచి సినిమాల మీద సినిమాలు.. దాదాపు అన్నీ విలన్ వేషాలే. తెలుగు సినిమాకు కొత్త విలన్ దొరికాడు అంటూ అందరూ క్యూ కట్టారు. పాత విలన్లను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకుపోయారు. ఎన్టీఆర్ పోలికలు ఉండడంతో ఆయనకు డూప్ గా కైకాల ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం ఉండేది. కెరీర్ లో 800కు పైగా చిత్రాల్లో నటించిన సత్యనారాయణ.. హీరోగా 13 చిత్రాల్లో నటించారు.
ఇక ఎన్టీఆర్ తో ఫైట్ సీన్స్ పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కైకాల.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘విలన్ అంటే శారీరకంగా ఎంతో బాధపడాలి. రామారావు నటించిన ఎన్నో చిత్రాల్లో నేను ప్రతినాయకుడిగా నటించా. ఆయనతో ఫైట్ అంటే గండం గడిచినట్లే. ఓసారి నిజంగానే ఆయన కత్తితో పొడిచేశారు. టైమింగ్ కుదరకపోతే ఆయన ఊరుకోరు. భీమ-కీచకుల యుద్థంలో భాగంగా ఇద్దరం తలపడ్డాం. ఆయన నా రొమ్ము మీద గుద్దుతుంటే చచ్చినంత పనైంది’’ అని వ్యాఖ్యానించారు కైకాల సత్యనారాయణ.