Advertisement
2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి గెలిచారు రాపాక వరప్రసాద్. కానీ, కొన్నాళ్లకు పవన్ కు ఝలక్ ఇచ్చి వైసీపీ పంచన చేరారు. ఆ సమయంలో ట్రెండింగ్ లో ఉన్న పేరు మళ్లీ ఇన్నాళ్లకు హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్యే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా ముగిశాయి. టీడీపీకి తక్కువ స్థానాలు ఉండడంతో ఒక సీటు కచ్చితంగా దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. వైసీపీపై తిరగబడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకే ఓటేశారు. అయితే.. అనూహ్యంగా మరో రెండు ఓట్లు ఎగస్ట్రాగా పడ్డాయి. దీంతో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలిచారు.
Advertisement
ఎన్నికల ప్రక్రియ అంతా అయిపోయి రెండు రోజులు పైనే అయింది. అయితే.. రాపాక సెన్సేషనల్ కామెంట్స్ తో ఎమ్మెల్సీ ఎన్నికలపై మళ్లీ చర్చ జోరందుకుంది. మొదట టీడీపీ తనతో బేరసారాలు జరిపిందని ఆరోపించారు వరప్రసాద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు అమ్ముకుంటే పది కోట్లు వచ్చేవని తెలిపారు. ఈ ఆఫర్ ను పార్టీ పైన ఉన్న గౌరవం, నమ్మకంతో వదిలేశానని వెల్లడించారు. రాజోలులో జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన ఈ విషయాల్ని బయటపెట్టారు.
Advertisement
ఇక్కడ రాపాక వ్యాఖ్యల వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్లిన ఈయనకు నియోజకవర్గంలో పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఆయనకు తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో టీడీపీ బేరసారాలు ఆడినా.. తాను లొంగలేదు అనే డ్రామా క్రియేట్ చేసి జగన్ ను కాకా పట్టే ప్రయత్నంలో ఉన్నారా? అనే డౌట్ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
మరోవైపు రాపాక వ్యాఖ్యలపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయన చిల్లర మనిషి అని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన వైసీపీకి అమ్ముడు పోయిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత.. వైసీపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. అయినా, రాపాకను కొనాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా గెలవడానికి 22 ఓట్లు చాలు అని.. తమకు 23 ఓట్లు స్పష్టంగా ఉన్నాయన్నారు. తాడేపల్లి స్క్రిప్ట్ ని వరప్రసాద్ చదువుతున్నారని ఆరోపించారు. ఆయనకు రూ.10 కోట్లు కాదు కదా.. రూ.10 వేలు కూడా ఎక్కువే అని ఎద్దేవ చేశారు బోండా ఉమ.