Advertisement
జనసేన పదో ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. మచిలీపట్నంలో వంద ఎకరాల స్థలంలో సభ, పార్కింగ్ ను నిర్వహిస్తున్నారు. జనసేనాని విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు భారీ ర్యాలీ తీశారు. ముందుగా విజయవాడ ఆటోనగర్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. భారీగా తరలివచ్చిన జనసైనికులు, వీర మహిళలతో కలిసి పవన్ వారిహి రథం ముందుకు కదిలింది. అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు పవన్.
Advertisement
ఆటోనగర్, తాడిగడప జంక్షన్, పోరంకి, పెనమలూరు, పామర్రు-గుడివాడ సెంటర్, గూడూరు మీదుగా మచిలీపట్నం సభా ప్రాంగణానికి వెళ్తున్నారు జనసేనాని. అయితే.. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ముందే చెప్పారు. కానీ, అశేషంగా తరలివచ్చిన జనంతో పద్దతిగా, సైలెంట్ గా వెళ్లడం కుదరదు కదా.. దీంతో ర్యాలీగా బయలుదేరాల్సి వచ్చింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
Advertisement
పవన్ కోసం వాహనాలు ఆపి మరీ జనం ఉండిపోవడంతో విజయవాడ-మచిలీపట్నం రహదారి కిక్కిరిసిపోయింది. కొందరు బస్సులు, లారీలపైకి ఎక్కి పవన్ కు జేజేలు పలికారు. వారందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు పవన్. సభా వేదికకు చేరుకోగానే ఆయన.. మొదట ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
సభా వేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. పవన్ స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉండడంతో.. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు, తమను అధికారంలోకి తీసుకొస్తే చేసే సంక్షేమం.. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు అన్ని పర్మిషన్లు ముందే తీసుకున్నామని.. అయినా పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదంటున్నారు జనసేన నేతలు.