Advertisement
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి పడ్డ ఎగస్ట్రా ఓట్ల చుట్టూ ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో కొనసాగుతోంది. క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలను పూర్తి ఆధారాలతోనే తమ నాయకత్వం సస్పెండ్ చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే.. సస్పెండ్ కు గురైన నలుగురిలో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. దానికి వైసీపీ నేతలు కౌటర్ ఎటాక్ చేసే పనిలో పడడంతో పంచ్ లు ఓ రేంజ్ లో పేలుతున్నాయి.
Advertisement
‘‘వైఎస్ కుమారుడి పార్టీ అంటే విలువలతో ఉంటుందని అనుకున్నా. అసలు విలువ లేని రాజకీయాలు ఉంటాయని నేను అనుకోలేదు. అమరావతి రైతుల కోసం ప్రాణం పోయేదాకా పోరాటం చేస్తా. పిచ్చి కుక్కతో సమానంగా నన్ను చూశారు. ఈరోజు నుండి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని. మొన్నటివరకు నాతోపాటు ఉన్నవారే నా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. నియోజకవర్గ ప్రజలు కలిసి వస్తే నేను వారి సమస్యపై పోరాటం చేస్తాను. నాకు ప్రాణ హాని ఉంది నాకేం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత. నాపై కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడుతున్నారు. నేను దళిత ఎమ్మెల్యేను అందుకే పార్టీలో సరైన గుర్తింపు లేదు’’ అని సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
Advertisement
ఈమె కామెంట్స్ వైసీపీకి కోపం తెప్పించింది. వెంటనే వరుసబెట్టి మీడియా ముందుకొచ్చారు నేతలు. ఎన్నికల రోజు ఉండవల్లి శ్రీదేవి ఎంత హడావుడి చేశారో అందరూ చూశారని, సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించారని విమర్శించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉండవల్లి శ్రీదేవి కన్నా ఊసరవెల్లి శ్రీదేవి అంటే బాగుంటుందని ఎద్దేవ చేశారు. అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు గుర్తొచ్చిందా? దొంగ చాటుగా రూ.10 కోట్లు, రూ.15 కోట్లు డబ్బులు తీసుకుని ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.
ఉండవల్లి శ్రీదేవి జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని హెచ్చరించారు ఎంపీ నందిగం సురేష్. స్కాములు, స్కీములు, టిడ్కో ఇళ్లు అంటూ ఏదేదో మాట్లాడతున్నారని.. ఆమె వెనుకా, ముందూ చూసుకుని మాట్లాడాలని సూచించారు. విమర్శలు చేసే ముందు అన్ని ఆలోచించుకోవాలని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. తమ నుంచి ఉండవల్లి శ్రీదేవికి ఎలాంటి ఆపద ఉండదన్న ఆయన.. పార్టీ స్టాండ్ దాటారు కాబట్టే వేటు పడిందని స్పష్టం చేశారు. శ్రీదేవికి ఏపీలో పూర్తి రక్షణ ఉందని.. ఆమెకు టీడీపీ నుంచే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.